రూపాయి ఖర్చు లేకుండా కాన్పు
- కరోనా కాలంలోనూ మెరుగైన వైద్యం
- సగటున రోజుకు 20కిపైగా ప్రసవాలు
- గడిచిన పదకొండు నెలల్లో 6861 కాన్పులు
- అందులో 3వేలకుపైగా నార్మల్ డెలివరీలు
- మొత్తం 6037 మందికి కేసీఆర్ కిట్లు
- నవజాత శిశువులకూ సేవలు
- అన్ని వర్గాలను రప్పించేందుకు ప్రయత్నాలు
కాన్పు అంటే మహిళలకు పునర్జన్మ. పండంటి బిడ్డను సుఖంగా ప్రసవించాలని ప్రతి గర్భిణి కోరుకుంటుంది. వీరి కోరికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందుతున్నది. గతంలో ప్రభుత్వ దవాఖాన అంటేనే భయపడిన వారంతా ఇప్పుడు అదే వైద్యశాలలో బారులు తీరుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి గర్భిణులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ వైద్యులు రోజుకు 20కిపైగా డెలివరీలు చేసి, మన్ననలు అందుకుంటున్నారు.
ప్రసవం అంటే ఖర్చుతో కూడుకున్నది. ఏ ఇతర ప్రైవేట్ దవాఖానకు వెళ్లినా వేలకు వేలు గుంజుతున్నారు. ప్యాకేజీ పేరిట అడ్డుగోలుగా దండుకుంటున్నారు. సాధారణంగా ఒక్కో డెలివరీకి 50 వేలు, అంతకంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు 50వేల నుంచి లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తుండగా, ప్రవసం అంటేనే సామాన్యులు హడలి పోతున్నారు. ప్రైవేట్ దోపిడీని భరించలేక పోతున్నారు. వీటన్నింటినీ గమనించిన తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తున్నది. కోట్లాది నిధులతో సర్కారు దవాఖానలను బలోపేతం చేసింది. ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని (ఎంసీహెచ్) సకల హంగులతో తీర్చిద్దిదింది. అత్యాధునిక వైద్య పరికరాలను, అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులో ఉంచింది. ఇదే సమయంలో కేసీఆర్ కిట్స్‌ను ప్రవేశపెట్టింది. సర్కారు దవాఖానల్లో ప్రసవించిన ఆడబిడ్డలకు మగ శిశువు జన్మిస్తే 12 వేలు, ఆడ శిశువు పుడితే 13 వేల చొప్పున నాలుగు దశల్లో ప్రోత్సాహకాలను అందిస్తున్నది. శిశువుల సంరక్షణకు వివిధ సామగ్రితో కూడిన 2 వేల విలువైన కూడిన కిట్‌ను అందిస్తున్నది.
అధునాతన పరికరాలు..
మతాశిశు సంరక్షణ కేంద్రంలో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి వైద్య పరికరాలు ఉమ్మడి జిల్లాలోని ఒకట్రెండు ప్రైవేట్ దవాఖానల్లో మినహా ఎక్కడా లేవు. బాలింతలకు ఐసీయూ ఏర్పాటు చేశారు. పిల్లల కోసం రెండు వెంటిలేటర్లు ఉన్నాయి. సెల్ కౌంటర్ ల్యాబ్ అందుబాటులో ఉంది. 40 లక్షలతో 3 లేటెస్ట్ స్కానింగ్ మిషన్లు తేగా, జన్మించే శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు కలర్ డాప్లర్ ఉంది. గుండె సంబంధ వ్యాధులు ఉన్న వారికి సురక్షితంగా డెలివరీ చేసేందుకు కూడా స్కానింగ్ యంత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. నవజాత శిశువులకు కూడా ఐసీయూ చికిత్సలు అందిస్తున్నారు.
అన్ని వర్గాలకూ సేవలు..
ఎంసీహెచ్‌కు అన్ని వర్గాలను రప్పించేందుకు కరీంనగర్ కలెక్టర్ శశాంక ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అర్బన్ ఏరియాల్లోని గర్భిణుల మెప్పు పొందేందుకు యత్నాలు చేస్తున్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రాంతానికి చెందిన అర్బన్ మహిళా స్వశక్తి సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్న ప్రసవాలు, గర్భిణులకు అందిస్తున్న సేవలు, ఆధునిక వైద్య సదుపాయాల గురించి వివరించే ఏర్పాట్లు చేశారు. మధ్య, ఎగువ తరగతి వారి కోసం ప్రత్యేక గదుల సదుపాయం కూడా ఈ కేంద్రంలో ఉంది. రోజుకు 500 నామమాత్రపు చార్జీలతో గదులు సమకూర్చుతుండడంతో అన్ని వర్గాల వారు ఇక్కడ ప్రసవాలకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఓపీలో ఎగువ తరగతికి చెందిన గర్భిణులు కూడా కనిపిస్తున్నారు. రోజుకు కనీసం 200 మందికి ఓపీ చూస్తున్నారు. ఇందులో 5 నుంచి 10 శాతం ఎగువ తరగతికి చెందిన గర్భిణులు వైద్య పరీక్షలకు వస్తున్నారు.
సాధారణ ప్రసవాలకే మొగ్గు..
జిల్లాలో మార్చి నుంచి కొవిడ్ వచ్చినప్పటికీ ప్రైవేట్ దవాఖానలకు దీటుగా మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలందించాం. మధ్యలో ప్రసవాలు తగ్గినా గత నెలలో 700కు పైగా జరిగాయి. ఎంత క్లిష్టమైనా శస్త్ర చికిత్సలైనా చేస్తూ మాతా శిశు సంరక్షణకు కృషి చేస్తున్నాం. కొంతమంది ఇంకా పాత పద్ధతిలోనే మంచి రోజులంటూ శస్త్ర చికిత్సల కోసం క్యూలు కడుతున్నారు. కానీ, సాధారణ ప్రసవం జరిగితే తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉంటారు. ప్రధానంగా మొదటి కాన్పులో ఎక్కువ శాతం సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపుతాం. దీనిని ప్రజలు గమనించాలి. ఏమైనా క్రిటికల్‌గా ఉంటే మేమే కేసులు తీసుకుని శస్త్ర చికిత్సలు చేస్తాం. మాపై ఒత్తిడి తేవద్దు.
- డాక్టర్ సంగీత, గైనకాలజిస్టు (ఎంసీహెచ్)
ప్రైవేట్‌ల లక్ష వరకు ఖర్చయితుండె..
నేను మొదటి నుంచి ఇక్కన్నే చూపించుకుంటున్న. నెలనెలా ఇక్కడకే అచ్చిన. స్కానింగ్‌లతో పాటు పరీక్షలు ఫ్రీగనే చేసిన్రు. మందులు ఇచ్చిన్రు. రానుపోను కిరాయిలు తప్ప ఒక్క రూపాయి ఖర్చుకాలె. నెలలు నిండినయని మొన్న తొమ్మిదో తారీఖున అచ్చి జాయిన్ అయిన. 11న డెలివరీ చేసిన్రు. బాబు పుట్టిండు. కేసీఆర్ కిట్‌తో పాటు 12వేలు ఇచ్చిన్రు. వైద్యులు, సిబ్బంది మంచిగ చూసుకుంటున్నరు. అదే నెలనెలా పరీక్షలు, డెలివరీ అన్నీ కలిపి ప్రైవేట్‌ల లక్ష వరకు ఖర్చయితుండె. ఇక్కడైతే అంతా ఫ్రీగానే అయిపోయింది.
- నెల్లి రేవతి, నగునూర్
నెలకు వెయ్యి ప్రసవాలే లక్ష్యం..
గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 250 నుంచి 300 ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు 700కి పైగా అవుతున్నాయి. ప్రతి నెలా వెయ్యి ప్రసవాలు చేసేలా ప్రణాళికలు వేస్తున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహం, కలెక్టర్ శశాంక చొరవతో మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం ఉంది. సదుపాయాలు, స్టాఫ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే ఒక బెడ్‌కు ఏడాదికి 10 వేలు వస్తాయి. అప్పుడు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.
- డాక్టర్ రత్నమాల, మెడికల్ సూపరింటెండెంట్
అర్బన్ కేసులు పెంచే ప్రయత్నం చేస్తున్నాం..
ఎంసీహెచ్‌లో పైసా ఖర్చు లేకుండా ప్రసవాలు చేస్తున్నాం. అయితే అర్బన్ ప్రాంతం నుంచి వచ్చే గర్భిణుల సంఖ్య పెరగడం లేదు. వీరిని ఆకట్టుకునేందుకు కలెక్టర్ శశాంక ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పట్టణాల్లోని సెర్ఫ్ మహిళా సంఘాలను పిలిపించి ఎంసీహెచ్ సేవలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రైవేట్ దవాఖానాల తరహాలో త్వరలో ఒక బ్రోచర్‌ను ముద్రించి ఇంటింటికి పంపిణీ చేస్తాం. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గెస్టు వైద్యులను తీసుకుంటున్నాం. ప్రసవాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
- డాక్టర్ సుజాత, డీఎంఅండ్‌హెచ్ వో (కరీంనగర్)
ప్రైవేట్ వైద్యశాలలపై ప్రభావం..
ఎంసీహెచ్ ప్రైవేట్ వైద్యశాలలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. గతంలో ఒక్క నెలలో చేసిన ప్రసవాలను ప్రభుత్వ వైద్యులు ప్రస్తుతం ఒక్క రోజులోనే చేసి చూపుతున్నారు. ప్రస్తుతం 70 శాతం ప్రసవాలు ఈ కేంద్రంలోనే జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో బర్త్‌రేట్ ఏడాదిలో 13 వేల వరకు ఉంటుంది. అంటే నెలకు సగటున వెయ్యి నుంచి 1,200 ప్రసవాలు జరుగుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలోనే నెలకు 700కుపైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ నెలలో వైద్యులు 800 ప్రసవాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లెక్కన 70 శాతానికి మించి ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో చూస్తే సుమారు 65 మంది స్త్రీల వైద్య నిపుణులు ఉన్నారు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి ముందు ఈ వైద్యులు క్షణం తీరిక లేకుండా సేవలు అందించేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా మంచిర్యాల, ఆదిలాబాద్, జన్నారం, లక్షెట్టిపేట, ఊట్నూర్‌తోపాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి డెలివరీల కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానలకు వచ్చేవారు. ఎంసీహెచ్‌లో అందిస్తున్న సేవలు, కేసీఆర్ కిట్ ప్రభావంతో ఇప్పుడు వీరంతా మాతా, శిశు ఆరోగ్య కేంద్రం వైపు మళ్లారు. గడిచిన తొమ్మిది నెలల్లో మొత్తం 6861 ప్రసవాలు చేస్తే, అందులో 3వేల వరకు నార్మల్ డెలివరీలు చేశారు. అలాగే 6037 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చారు.
తల్లీబిడ్డలకు ఉచిత వైద్యం..
ఎంసీహెచ్‌లో రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన సేవలందిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులకు నెల నెలా ఓపీ చూస్తున్నారు. నెల నెలా పరీక్షల దగ్గరి నుంచి డెలివరీ అయి, ఇంటికి చేరే వరకు అన్నీ ఉచితంగానే చేస్తున్నారు. నవజాత శిశువులకు సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అధునాతన ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీకాలు, ఇతర వైద్య ఖర్చులకు ప్రవేట్ దవాఖానల్లో వెయ్యి నుంచి 2వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. నెలలు నిండక జన్మించినా, తక్కువ బరువుతో పుట్టినా, శ్వాస ఆడకపోయినా, నంజు వచ్చినా, నెలలు నిండి సరిగ్గా పెరగకుండా జన్మించిన పిల్లలకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ లోపాలతో పుట్టిన శిశువులకు వైద్యం చేసేందుకు రోజుకు 10 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేసే ప్రైవేట్ దవాఖానలు ఉన్నాయి. ఇలాంటి సేవలన్నీ ఇప్పుడు ఎంసీహెచ్‌లో నయా పైసా ఖర్చు లేకుండా అందుతున్నాయి. ఈ కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్‌ఎన్‌సీయూ కేంద్రంలో రోజుకు 270కిపైగా నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు.