మలేరియా మరణాల గుట్టు తెలిసింది

     కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

  • 100 ఏండ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు 
  • మెదడుకు ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే
  • భారత్‌, బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి): మలేరియా వ్యాధి మెదడుపై ఎలా ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తద్వారా 100 ఏండ్ల మిస్టరీని ఛేదించారు. ఈ పరిశోధనల్లో బ్రిటన్‌ పరిశోధకులతో పాటు భారతీయ శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకొన్నారు. సెరిబ్రల్‌ మలేరియా సోకినప్పుడు మనిషి ఎందుకు చనిపోతున్నాడన్న విషయం ఇప్పటిదాకా అంతు చిక్కలేదు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 65 మంది సెరిబ్రల్‌ మలేరియా రోగులు, 26 మంది మామూలు మలేరియా రోగులపై పరిశోధనలు నిర్వహించారు. వారికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ నిర్వహించి మెదడులో మార్పులను గమనించారు.  చనిపోయిన వారిలో మెదడు ఎలా మార్పు చెందిందో పోల్చి చూశారు. సెరిబ్రల్‌ మలేరియా కేసుల్లో మెదడుకు ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. సెరిబ్రల్‌ మలేరియా ప్లాస్మోడియం ఫాల్సిపారమ్‌ వల్ల వస్తుంది. ఇది పిల్లలు, పెద్దలపై వేర్వేరుగా ఎలా ప్రభావం చూపిస్తుందో బ్రెయిన్‌ ఇమేజింగ్‌ టెక్నిక్‌ ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సెరిబ్రల్‌ మలేరియా వచ్చిన ప్రతీ ఐదుగురిలో ఒకరు చికిత్స తీసుకున్నా కూడా చనిపోతున్నారు.