విషపూరిత రసాయనం ట్రైక్లోసాన్‌ను కలపడంతో ప్రజారోగ్యానికి ముప్పు
కొన్ని దేశాల్లో ఆంక్షలు... మన దేశంలో యథేచ్ఛగా వినియోగం
నిత్యం వాడే సబ్బులు, టూత్ పేస్ట్‌లు, డియోడరెంట్లలో ఉపయోగిస్తున్న సూక్ష్మజీవ సంహారక రసాయనం ‘ట్రైక్లోసాన్’.. శరీరంలోని నరాల వ్యవస్థను దెబ్బతీస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. సబ్బులు, టూత్‌పే్‌స్టలు, డియోడరెంట్లలో సూక్ష్మక్రిములు పెరగకుండా అడ్డుకోవడం ద్వారా వాటి నిల్వ కాలాన్ని పెంచేందుకు ‘ట్రైక్లోసాన్’ వంటి రసాయనాలను వాడుతారు. కొన్ని వైద్య పరికరాలు, చివరకు వంటపాత్రల తయారీలోనూ దీన్ని వినియోగిస్తున్నారు. ఈ రసాయనాన్ని అతి తక్కువ పరిమాణంలో ఉపయోగించినా శరీరంలోని నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడే జన్యువులు, ఎంజైమ్‌లు తీవ్రంగా దెబ్బతింటాయి. అంతేకాకుండా ఈ రసాయనం నరాల్లోని కణజాలాన్ని సైతం దారుణంగా దెబ్బతీస్తుందని ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనామికా భార్గవ్ సారథ్యంలోని పరిశోధకుల బృందం అధ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వం అనుమతించిన మొత్తంలో 500వ వంతు ట్రైక్లోసాన్ రసాయనం ఉపయోగించినా నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుందని పరిశోధక బృందం సభ్యుడు పి.నరసింహ వెల్లడించారు. ఈమేరకు వివరాలతో వీరు రూపొందించిన పరిశోధనా పత్రం బ్రిటన్ నుంచి వెలువడే ‘కెమోస్ఫియర్’ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఆంక్షలు విధించడం తప్పనిసరి
ట్రైక్లోసాన్‌ను తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తే దాన్ని మన శరీరం కొంతవరకు తట్టుకోగలుగుతుంది. అయితే ఈ రసాయనాన్ని ఉపయోగించిన పదార్థాలను ఎక్కువ కాలం వాడితే అనారోగ్యం ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. ఈ రసాయనం వల్ల నాడీ వ్యవస్థ కుప్పకూలుతుంది.. ఫలితంగా భవిష్యత్తులో అల్జీమర్స్, నరాల సమస్యలు వంటివి తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ట్రైక్లోసాన్ దుష్ప్రభావాన్ని గుర్తించిన కొన్ని దేశాలు ఈ రసాయనం వినియోగంపై అంక్షలు విధించాయి. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కూడా ట్రైక్లోసాన్ వినియోగంపై ఆంక్ష లు విధించింది. భారత ప్రభుత్వం 1960లలో వైద్యపరమైన ఉత్పత్తులకే దీని వాడకాన్ని పరిమితం చేసింది. అయితే సరైన పర్యవేక్షణ కొరవడటంతో ఈ రసాయనాన్ని మన దేశంలోనూ విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.ఈ నేపథ్యంలో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ట్రైక్లోసాన్ వంటి రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా అతి తక్కువ పరిమాణంలో ఉపయోగించేలా అంక్షలు విధించడం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు.