కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
హైదరాబాద్, (ఆరోగ్య జ్యోతి): రాష్ట్రంలో కరోనా తొలి టీకా ఎవరికి ఇవ్వాలన్న విషయమై స్పష్టత వచ్చింది. గాంధీ ఆస్పత్రి నర్సుకు టీకా ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తుందని విశ్వసనీయ సమాచారం. మరోవైపు కొవిడ్-19 రోగులకు ప్రారంభం నుంచి గాంధీలోనే చికిత్స అందిస్తుండగా.. వారికి నర్సులు విశేష సేవలందిస్తున్నారు. వైద్యులను మించి సమయం కేటాయిస్తూ.. ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మొదటి టీకాను ఇస్తే నర్సుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని వివరిస్తున్నారు.కాగా, టీకా రాష్ట్రానికి చేరిన రెండో రోజుల్లోపే పంపిణీ ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. మూడు కోట్ల డోసుల నిల్వకు సరిపడా ప్రత్యేక కోల్డ్ చైన్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా ఉన్న నాలుగు శాఖల సిబ్బంది, 50 ఏళ్ల పైబడిన వారికి తొలి దశలో టీకా ఇవ్వనున్నారు. వీరి సంఖ్య రాష్ట్రంలో 80 లక్షల వరకు ఉంటుందని అంచనా.అలాగే టీకా ఇవ్వడానికి ముందు ఆరోగ్యానికి సంబంధించి అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేశారు. వీటి ద్వారా వారి ఆరోగ్య స్థితిని వాకబు చేయనున్నారు. ఇక టీకా రెండు డోసులు తీసుకున్నాక ఏమైనా సమస్యలు తలెత్తితే వైద్య సిబ్బందికి నివేదించేందుకు టోల్ ఫ్రీ నంబరు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. టీకాపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.