కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
- వచ్చేనెలలో ఇచ్చేలా పూర్తవుతున్న ఏర్పాట్లు
- మూడు జిల్లాల్లో వ్యాక్సిన్‌కు 1,08,925 మంది గుర్తింపు
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా నివారణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు తుదిదశకు చేరాయి. వచ్చేనెలలో టీకా (వ్యాక్సిన్) అందుబాటులోకి రానుండడంతో తొలుత ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా కట్టడిలో ముందువరుసలో ఉండే వైద్యులు, ఆరోగ్యశాఖ సిబ్బందికి తొలిదశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం వైద్య,ఆరోగ్య శాఖాధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 1,08,925 మంది ఉన్నట్లు గుర్తించగా, జనవరిలో వీరందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ సరఫరా, నిల్వ సామర్థ్యం, టీకా వేసే విధానం తదితర వాటిపై ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రముఖ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకాను ఈ మూడు జిల్లాల్లో వైద్యశాఖ సిబ్బందితోపాటు ప్రైవేటు దవాఖాన వైద్యులు, సిబ్బందికి వేయనున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ వచ్చేనెలలో అందుబాటులోకి రానుండడంతో తొలిదశలో టీకా ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. తొలిదశలో గ్రేటర్ పరిధిలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారీగా సంబంధిత వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మొదటిదశ వ్యాక్సినేషన్‌కు సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. తొలుత వైద్యులు, నర్సింగ్ సి బ్బంది, పారామెడికల్, వార్డుబాయ్, స్వీపర్లు, సెక్యూరిటీగార్డులతోపాటు వైద్యశాఖలో పనిచేసే ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మూడు జిల్లాల వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌సెక్టార్లలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వివరాలు సేకరించారు. మొత్తం 1,08,925 మంది ఉన్నట్లు గుర్తించగా, జనవరిలో వీరందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రముఖ ఔషధ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకాను ఈ మూడు జిల్లాల్లో వైద్యశాఖ సిబ్బందికి ఇవ్వనున్నారు.
హైదరాబాద్ జిల్లాలో..
హైదరాబాద్ జిల్లా పరిధిలో 70,600 వేల మందికి తొలిదశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. వీరిలో వైద్యశాఖలో 18,911 మందిని ఇప్పటికే గుర్తించామని, ఇంకా మరికొంత మందిని గుర్తిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటులో 46,842 మందిని గుర్తించామన్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 26,078 మందిని గుర్తించామని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. వైద్యశాఖలో 6079 మంది, ప్రైవేటులో 19999 మందిని గుర్తించామని, వీరందరికీ కరోనా నివారణ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 12,247 మందిని గుర్తించినట్లు జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాంకుమార్ తెలిపారు. వైద్యశాఖలో 2159 మంది, ప్రైవేటులో 10,088 మందిని గుర్తించామని పేర్కొన్నారు.