64 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్‌లు

 హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి):రాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న 64 ప్రైవేటు ఆస్పత్రులపై అధిక బిల్లుల వసూలుకు సంబంధించి ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు వచ్చాయని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. వాటిని పరిశీలించి.. 24 గంటల నుంచి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని చెప్పారు. వారి నుంచి వచ్చే సమాధానం అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొత్తం ఫిర్యాదుల్లో హైదరాబాద్‌లో 39, మేడ్చల్‌లో 22, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్‌ అర్బన్‌లో 7, సంగారెడ్డిలో 2, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో ఒక్కొక్కటి వచ్చాయన్నారు. కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిపై 6, బేగంబజార్‌లోని ఆస్పత్రిపై 5, కాచిగూడలోని ఆస్పత్రిపై 3 ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే ఒక ఆస్పత్రి అనుమతి రద్దు చేశామని తెలిపారు. ప్రజలు ఫిర్యాదులను 9154170960 నంబరుకు వాట్సాప్‌ చేయాలని శ్రీనివాసరావు సూచించారు. కాగా, టీకా, పడకల గురించి 676 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.