హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి):నగరంలో ఎన్నో ఆస్పత్రులు ఉన్నప్పటికీ కరోనా రెండో దశ వ్యాప్తిలో ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి. ఎంతోమంది బాధితుల్లో కొందరు సరైన సమయంలో చికిత్స లభించక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మంచి వైద్యంతో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు సీపీ సజ్జనార్‌లో సంకల్పించారు. అలా ఆయన మనసులో పుట్టిన ఆలోచనకు కార్యరూపమే ప్రాజెక్టు ఆశ్రయ్ ఆస్పత్రి. తన ఆలోచనలను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)తో సజ్జనార్ చర్చించగా అందుకు వారు అంగీకరించారు. ఓ పెయింగ్ గెస్ట్ హాస్టల్‌ను అద్దెకు తీసుకొని.. కేవలం ఐదురోజుల్లోనే 50 పడకలతో ఆస్పత్రిని సిద్ధం చేశారు.ఈ నెల 3న ‘ప్రాజెక్టు ఆశ్రయ్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా వచ్చి సరైన చికిత్స అందని పేదలు, పోలీసులు, జర్నలిస్టులు ఇలా ఎవరైనా సరే ప్రాజెక్టు ఆశ్రయ్‌లో వైద్య సేవలు పొందవచ్చునని సజ్జనార్ పేర్కన్నారు. ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్నారు. ఉచిత వైద్యంతో పాటు భోజన వసతిని కల్పిస్తున్నారు. మొదటి దశలో కేవలం 50 పడకలతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిని కేవలం 20 రోజుల్లోనే 100 పడకలకు పెంచారు. మరో 50 పడకలు సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా 10 ఆక్సిజన్ పడకలు, 6 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 80 మంది వైద్యులు ‘ప్రాజెక్టు ఆశ్రయ్’లో కరోనా బాధితులకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు 160 మంది కరోనా రోగులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ మరో 45 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ని బుధవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు. సజ్జనార్‌ను, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఆయన అభినందించారు.