వైద్య ఆరోగ్య శాఖ సిద్దిపేట
జిల్లా జేఏసీ విజ్ఞప్తి
సిద్దిపేట(ఆరోగ్యజ్యోతి):
వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని
విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బీజేపీ నేత
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్ ముజమిల్
ఖాన్ ,జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ లకు శనివారం జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు
డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ శ్రీధర్,డాక్టర్ భార్గవి, పారామెడికల్ ఉద్యోగుల సంఘం నాయకులు జాకీర్ హుస్సేన్, చక్రధర్ లు
మాట్లాడుతూ గత ఏడాది కాలంగా పారామెడికల్ సిబ్బంది, ఆశ వర్కర్లు నిరంతరం కరోనాతో
పోరాడుతున్నారని తెలిపారు. సుమారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది ఆశ
వర్కర్లు ప్రాణాలు కోల్పోయారని వందలాది మంది వైద్య ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు
కరోనా వ్యాధికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఇలాంటి
పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని
తెలిపారు. అన్ని సంఘాల సమన్వయంతో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి
పరిష్కరించడం కోసం జేఏసీగా ఏర్పడం జరిగిందన్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖలో
పని చేస్తున్న అన్ని స్థాయిలో పనిచేసే సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా
కోవిద్ వ్యాక్సినేషన్ చేయాలన్నారు. కరోనా బారిన పడ్డ వైద్య ఉద్యోగులందరికీ
ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ తో కూడిన 10 శాతం ప్రత్యేక బెడ్ లను
సమకూర్చాలి అన్నారు. సిబ్బందికి కరోనా సోకితే నిమ్స్ లో డాక్టర్లకు కేటాయించిన
మాదిరిగా పారామెడికల్ సిబ్బంది కి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే వైద్య
ఉద్యోగుల కుటుంబ సభ్యులకు జిల్లా
కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
కరోనా వ్యాధి న పడి మృతి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ 50 లక్షల
ఇన్సూరెన్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 50 లక్షల ఎక్స్గ్రేషియా
చెల్లించాలని కోరారు. కరోనా వ్యాధికి గురై మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులలో
అర్హతకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరోనా ఇన్సెంటివ్ 20 20 ఏప్రిల్
మే, నెల మాత్రమే ఇచ్చారని, తర్వాత కాలంలో ఇవ్వలేదని దానిని కొనసాగించి వైద్య
ఉద్యోగులకు అండగా నిలవాలన్నారు. రోజురోజుకు వైద్య ఉద్యోగుల పై పెరుగుతున్న పని
భారాన్ని తగ్గించడానికి ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అందరి కాంట్రాక్ట్ కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని
విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న
బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులకు ఇస్తున్న పొల్యూషన్ హాజర్డ్
అలవెన్స్ మాదిరి అత్యంత రిస్కు జోన్ లో పనిచేస్తున్న వైద్యులందరికీ బేసిక్ పే ,30 శాతం బయో
హజర్డ్ అలవెన్స్ వెంటనే మంజూరు
చేయాలన్నారు. ఉద్యోగుల విధుల్లో భాగంగా ప్రతిరోజు వైరస్ కు గురయ్యే ప్రమాదాన్ని
నివారించేందుకు రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో అన్నిరకాల కాంట్రాక్టర్ డాక్టర్లు, పారామెడికల్
ఉద్యోగుల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రస్తుతం ఆశా వర్కర్లకు
ఇస్తున్న పారితోషకం బదులు ఫిక్స్ డ్ వేతనం
ఇవ్వాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు, వ్యాక్సి నేషన్ వల్ల పారిశుద్ధ్యంలో లోపిస్తుందని , వెంటనే నాలుగో
తరగతి ఉద్యోగులను నియమించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో
పనిచేస్తున్న కంటింజెంట్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ
కార్యక్రమంలో జేఏసీ నాయకులు గాలి రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, మహేందర్, రాజుగౌడ్, నాగేందర్ రెడ్డి ,గణేష్, అనిల్,కొండయ్య, రచ్చ రాజు తదితరులు పాల్గొన్నారు.