చైనాలో వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ

 బీజింగ్‌: చైనా నుంచి వ్యాపించిన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయగా ఆ దేశంలోనే మరో వింత కేసు వెలుగుచూసింది. పక్షుల్లో వ్యాపించే బర్డ్‌ ఫ్లూలో ‘హెచ్‌10ఎన్‌3’ రకం (స్ట్రెయిన్‌) ఓ వ్యక్తికి సోకింది. ఈ స్ట్రెయిన్‌ మనిషికి సోకడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. చైనాలోని జెన్‌జియాంగ్‌ నగరంలో 41 ఏండ్ల వ్యక్తికి ఈ స్ట్రెయిన్‌ సోకినట్టు గత నెల 28న గుర్తించామని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. అతనికి ఆ వైరస్‌ ఎలా సోకిందో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీజీటీఎన్‌ టీవీ పేర్కొంది. చైనా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఈ కేసుతో ఆందోళన చెందక్కర్లేదని అంటున్నారు. పౌల్ట్రీలో హెచ్‌1ఎన్‌3 తక్కువ ప్రమాదకరమైన స్ట్రెయిన్‌ అని, పెద్దఎత్తున వ్యాపించే ముప్పు చాలా తక్కువని వారు చెబుతున్నారు. ‘బర్డ్‌ ఫ్లూగా వ్యవహరించే ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాలో చైనాలో పలు స్ట్రెయిన్లు ఉన్నాయి. కొన్ని చాలా అరుదుగా మనుషులకు, సాధారణంగా పౌల్ట్రీలో పనిచేసే వ్యక్తులకు సోకుతుంటాయ’ని వారు చెప్పారు. ఇన్‌ఫ్లూయెంజా ‘ఏ’ వైరస్‌లో హెచ్‌5ఎన్‌8 ఒక ఉపరకం. హెచ్‌5ఎన్‌8 ఒక్కటే మనుషులకు కొంత ప్రమాదకరం. ఈ రకంతో పక్షులకు, పౌల్ట్రీకి ముప్పు చాలా ఎక్కువ.