‘ఆక్సిజన్‌’పై మోదీ సమీక్ష

దిల్లీ(ఆరోగ్యజ్యోతి): దేశంలో మరికొద్ది నెలల్లో కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్‌ను విస్తరిస్తూనే మరోవైపు కరోనా ఔషధాలు, ప్రాణవాయువు కొరత ఏర్పడకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు, సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.త్వరలో దేశవ్యాప్తంగా 1500 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు రానున్నాయి. పీఎం-కేర్స్‌ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణవాయువు లభ్యత, ప్లాంట్ల నిర్మాణంపై మోదీ నేడు సమీక్ష నిర్వహించారు. పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే నాలుగు లక్షలకు పైగా ఆక్సిజనేటెడ్‌ పడకలకు ప్రాణవాయువు అందించేందుకు వీలవుతుందని అధికారులు మోదీకి వివరించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.